శ్రీ శ్రీ శిక్షాష్టకం
1.
చేతోదర్పణ మార్జనం
భవమహాదావాగ్నినిర్వాపణం
శ్రేయఃకైరవచంద్రికావితరణం
విద్యావధూజీవనం
ఆనందాంబుధివర్ధనం
ప్రతిపదం పూర్ణామృతాస్వాదనమ్
సర్వాత్మస్నపనం పరం విజయతే
శ్రీకృష్ణసంకీర్తనమ్
ప్రతి పదార్థం
చేతః - హృదయమనే; దర్పణ - దర్పణమును; మార్జనం - శుద్ధిచేస్తుంది; భవ— సంసారమనే; మహా దావాగ్ని - మహాదావాగ్నిని; నిర్వావణం- ఆర్పుతుంది; శ్రేయః - శ్రేయస్సుఅనే; కైరవ - తెల్ల కలువకు; చంద్రికా- వెన్నెలను, వితరణం-విరబూయ చేస్తుంది; విద్యా - అన్ని విద్యలనే, వధూ - వధువుకు; జీవనం ప్రాణము ఆనంద- ఆనందమనే, అంబుద్ధి - సాగరమును; వర్ధనం - వృద్ధి చేస్తుంది; ప్రతిపదం - అడుగడుగున; పూర్ణ అమృతా - పూర్ణామృతపు; ఆస్వాదనం - ఆస్వాదన; సర్వాత్మ - ఎల్లరకు; స్నపనం. ఆత్మస్నానము; వరం - దివ్యమైన; విజయతే-జయమగుగాక శ్రీకృష్ణనామ సంకీర్తనకు. శ్రీకృష్ణ సంకీర్తనం - శ్రీకృష్ణనామ సంకీర్తనకు.
అనువాదం
అనంతకాలము నుండి ప్రోగుపడిన ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరచునదియు మరియు జన్మమృత్యుభరితమైన భౌతికజీవన అగ్నిని శమింప జేయునదియునగు శ్రీకృష్ణసంకీర్తనమునకు జయము. చంద్రుని చల్లని కిరణములను ప్రసరింపజేసెడి కారణమున ఈ శ్రీకృష్ణసంకీర్తనము సర్వ మానవాళికి అతిముఖ్యమగు వరప్రసాదము. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవం ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మికానంద సాగరమును వృద్ధిజేయు ఈ శ్రీకృష్ణనామ సంకీర్తనము సర్వదా పూర్ణామృతా స్వాదనమును కలుగజేయగలదు.
2.
నామ్నామకారి బహుధా నిజసర్వశక్తి-
స్తత్రార్పితా నియమితః స్మరణే న కాలః |
ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి
దుర్ల్వైవమీదృశమిహాజని నానురాగః ॥
ప్రతి పదార్థం
నామ్నాం - భగవన్నామాలు; ఆకారి- ప్రకటమై యున్నాయి; బహుధా - నానారకాలు; నిజసర్వశక్తిః - నిజశక్తులు; తత్ర- దానిలో; అర్పితా—ఆవేశితమయ్యాయి; నియమితః - నియంత్రణము; స్మరణే - స్మరణలో; న లేదు; కాలః -కాలము యొక్క పరిగణన; ఏతాదృశీ - ఇంతగా; తవ - నీ; కృపా - కృప; భగవన్ - ఓ దేవా; మమ—నా యొక్క; అపి - అయినా; దుర్దైవం - దుర్భాగ్యము; ఈదృశం - ఎంతనంటే; ఇహా - దీనిలో (నామములో); అజని — కలగడము; న - లేదు; అనురాగః - అనురాగము.
అనువాదం
'హే ప్రభూ! నీ పవిత్రనామ మొక్కటే జీవులకు సర్వాభీష్టములను ఒసగగలదు. కృష్ణ, గోవింద అను అనేక నామములను కలిగిన నీవు ఆ దివ్య నామములందు నీ దివ్య శక్తులనన్నింటిని నింపి ఉన్నావు. ఆ నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిననిబంధనలు లేవు. హే ప్రభూ! నీ పవిత్ర నామములను కీర్తించుట ద్వారా నిన్ను సులభముగా చేరుటకు మమ్ము కరుణతో సమర్థులను కావించినను, దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల నాకు ఎట్టి ఆకర్షణయు కలుగుట లేదు.
3.
తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా
అమానినా మానదేన కీర్తనీయః సదా హరిః
ప్రతి పదార్థం
తృణాత్ ఆపి — గడ్డిపోచ కన్నను; సునీచేన— అల్పముగానై; తరో: - చెట్టు కన్నను; ఇవ — వలె; సహిష్ణునా—ఓర్పుతో; అమానినా- గర్వించక; మానదేన — అందరికీ గౌరవమును ఇస్తూ; కీర్తనీయః - కీర్తించాలి; సదా - సర్వదా; హరిః - హరినామమును.
అనువాదం
రహదారి యందలి తృణము కన్నను తాను తక్కువ అనెడి నమ్రతను కలిగి, వృక్షము కన్నను అధికమైన ఓర్పును గూడి, ఇతరులు అగౌరవపరచినను, వారికి సమస్త గౌరవమును ఒసగుటకు సిద్ధపడిన స్థితి యందే మనుజుడు హరినామమును ఉచ్చరింపవలెను. అట్టి మనోస్థితి యందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలెను.
4.
న ధనం న జనం న సుందరీం
కవితాం వా జగదీశ కామయే |
మమ జన్మని జన్మనీశ్వరే
భవతాద్భక్తిరహైతుకీ త్వయి ||
ప్రతి పదార్థం
న - కాదు; ధనం - ధనము; న - కాదు; జనం - అనుయాయులు; న— కాదు; సుందరీం— అతిసుందరియైన యువతి; కవితాం - తియ్యని మాటలలో వర్ణించబడిన కామ్యకర్మలు; వా—లేదా; జగదీశ - ఓ జగదీశా; కామయే - నేను కోరేది; మమా - నా యొక్క; జన్మని - జన్మలో; జన్మని - తరువాతి జన్మలో; ఈశ్వరే - భగవంతుని యెడ; భవతాత్— కలుగుగాక; భక్తి - భక్తి; అహైతుకీ—అహేతుకమైనది; త్వయి — నీ యెడ.
అనువాదం
"ఓ జగదీశా! నేను భౌతికసంపదలను, అనుయాయులను, అందమైన భార్యను, తియ్యని మాటలలో చెప్పబడిన కామ్యకర్మలను కోరను. జన్మజన్మలకు నేను నీ అహేతుకమైన భక్తియుత సేవనే కోరుకుంటున్నాను”
5.
అయి నందతనుజ కింకరం
పతితం మాం విషమే భవాంబుధౌ |
కృపయా తవ పాదపంకజ
స్థిత ధూళి సదృశం విచిన్తయ ॥
ప్రతి పదార్థం
అయి—ఓ ప్రభూ; నందతనుజ - నందతనయా శ్రీకృష్ణా; కింకరం - సేవకుడను; పతితం— పతితుడను; మాం - నన్ను: విషమే - ఘోరమైన; భవ అంబుధౌ - భవసాగరములో నుండి; కృపయా — నిర్హేతుక కరుణతో; తవ - నీ యొక్క; పాదపంకజ - పాదపద్మాల చెంత; స్థిత — నిలిచెడి; ధూళి సదృశం - ధూళికణముగా; విచిన్తయ - భావింపవలసింది.
అనువాదం
" 'ఓ ప్రభూ! కృష్ణా! నందతనయా! నేను నీ నిత్యదాసుడను. కాని నా కర్మఫలము కారణంగా ఘోరమైన అవిద్యాసాగరములో పడ్డాను. ఇపుడు నా యెడ నిర్హేతుక కరుణ చూపి నన్ను నీ పాదపద్మాలపై ధూళికణముగా భావింపవలసింది.
6.
నయనం గలదశ్రుధారయా
వదనం గద్గద రుద్ధయా గిరా |
పులకైర్నిచితం వపుః కదా
తవ నామ గ్రహణే భవిష్యతి ॥
ప్రతి పదార్థం
నయనం — నేత్రాలు; గలత్ ఆశ్రుధారయా - అశ్రుధారలచే; వదనం - గొంతు; గద్గర - గద్గదమై; రుద్ధయా—పూడుకొనిపోయి; గిరా - మాటలతో; పుల కై - దివ్యానందముతో నిక్కబొడుచుకున్నట్టి రోమాలతో; నిచితం — నిండి; వపు: - దేహము; కదా - ఎప్పుడూ; తవ - నీ యొక్క; నామగ్రహణే —నామకీర్తనలో; భవిష్యతి — కలుగుతుంది.
అనువాదం
“దేవా! నీ నామమును కీర్తిస్తున్నప్పుడు నిరంతరము కారే అశ్రుధారలతో నా నేత్రాలు అలంకృతమయ్యేదెన్నడు? నీ నామకీర్తన చేస్తున్నప్పుడు నా కంఠము గద్గదమై, శరీరముపై రోమాలు నిక్కబొడుచుకునేదెన్నడు?”
7.
యుగాయితం నిమేషేణ
చక్షుషా ప్రావృషాయితం |
శూన్యాయితం జగత్సర్వం
గోవిందవిరహేణ మే ||
ప్రతి పదార్థం
యుగాయితం—మహాయుగము వలె కనపడుతూ; నిమేషేణ ఒక్క నిముషము; చక్షుషా— కన్నుల నుండి; ప్రావృషాయితం — అశ్రువులు వర్షధారలుగా కారుతున్నాయి; శూన్యాయితం - శూన్యముగా కనపడుతోంది; జగత్ - జగత్తు; సర్వం - సర్వము: గోవింద - గోవిందుని (శ్రీకృష్ణుని); విరహేణ మే - విరహములో
అనువాదం
“ఓ గోవిందా! నీ విరహము వలన ఒక్క నిముషమును నేను ఒక మహాయుగముగా భావిస్తున్నాను. నా కన్నుల నుండి అశ్రువులు వర్షధారలుగా జారిపడుతున్నాయి, సమస్త జగత్తు నాకు శూన్యముగా కనబడుతున్నది.”
8.
ఆశ్లిష్య వా పాదరతాం పినష్టు మాం
అదర్శనాన్ మర్మహతాం కరోతు వా |
యథా తథా వా విదధాతు లంపటో
మత్య్రాణనాథస్తు స ఏవ నాపరః ||
ప్రతి పదార్థం
ఆశ్లిష్య—పరమానందముతో ఆలింగనము; వా - లేదా; పాదరతాం - పాదపద్మాల చెంత పడిన వాని; పినష్టు— కాళ్ళ క్రింద త్రొక్కనివ్వు; మాం - నన్ను; అదర్శనాన్ — దర్శనమీయక; మర్మహతాం—హృదయము పగులగొట్టడము; కరోతు - చేయనివ్వు; వా - లేదా; యథా - (తన ఇష్టము వచ్చిన) రీతిగా; తథా - అట్లే; వా - లేదా; విదధాతు - చేయనివ్వు; లంపటో - ఇతర వనితలతో తిరిగే లంపటుడు;మత్ప్రాణనాథ: - నా ప్రాణనాథుడు; తు - కాని; స— అతడు; ఏవ—మాత్రమే; నాపరః - ఇంకొకడు కాడు.
అనువాదం
తన పాదపద్మాల చెంత పడిన ఈ దాసీని శ్రీకృష్ణుడు గట్టిగా ఆలింగనము చేసికొన్నా ఫరవాలేదు. కాళ్ళ క్రింద త్రొక్కివేసినా ఫరవాలేదు లేదా నాకిక దర్శనమివ్వక నా హృదయాన్ని బ్రద్దలు కొట్టినా ఫరవాలేదు. ఆతడొక లంపటుడు; తనకు నచ్చింది చేస్తాడు. అయినా కేవలము ఆతడే నా ప్రాణనాథుడు.