శ్రీ దామోదరాష్టకం

1.

నమామీశ్వరం సచ్చిదానందరూపం
లసత్కుండలం గోకులే బ్రాజమానమ్
యశోదాభియోలుఖలాబ్ఢావమానం
పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా

ప్రతి పదార్థం

నమామి - నా వినయపూర్వక ప్రణామములు; ఈశ్వరం - దేవాది దేవునకు; సచ్చిదానందరూపం - శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు; లసత్కుండలం - సొర చేప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుచున్న చెవి లోలకులను కలిగి ఉన్నవాడు; గోకులే బ్రాజమానమ్ - దివ్యధామమైన గోకులములో ఎంతో సౌందర్య వంతముగా ప్రకాశించువాడు; యశోదాభియ - యశోదా మాతకు భయపడి; ఉలుఖలాబ్ఢావమానం - చెక్కరోలు పై నుండి దుమికి వేగముగా పరుగెత్తువాడు; పరామృష్టం - వెనుకనుండి పట్టుకొనుట; అత్యంతతో ద్రుత్య - అతనికంటే వేగంగా వెంటబడి; గోప్యా - గోపిక (యశోదామాత) చేత

అనువాదం

శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు, సొర చేప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుచున్న చెవి లోలకులను కలిగి ఉన్నవాడు, దివ్యధామమైన గోకులములో ఎంతో సౌందర్య వంతముగా ప్రకాశించువాడు, యశోదామాత చిలుకుతున్న వెన్నకుండను పగులగొట్టి, ఉట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగిలించుటమనే అపరాధము చేయుటచే భయపడి చెక్కరోలు పై నుండి దుమికి వేగముగా పరుగెత్తువాడు, కానీ అతనికంటే వేగంగా వెంటబడిన యశోదామాత చేత పట్టుబడిన వాడైనట్టి దేవాదిదేవుడైన శ్రీదామోదరునికి నా వినయ పూర్వక ప్రణామములు.


2.

రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం
కరాంభోజయుగ్మేన సాతంకనేత్రమ్
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ-
స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధమ్

ప్రతి పదార్థం

రుదంతం - ఏడుస్తూ; ముహు: - పదే పదే; నేత్రయుగ్మం - రెండు కళ్ళను; మృజంతం - నులుముకుంటున్నాడు; కరాంభోజయుగ్మేన - తన రెండు కమల హస్తాలతో; సాతంకనేత్రమ్ - భయముతో నిండిన కళ్ళతో; ముహు: - పదే పదే; శ్వాస - దీర్ఘశ్వాస వలన; కంప - ఊగుతూ ఉన్నది; త్రిరేఖాంకకంఠ - (శంఖమువలే మూడు రేఖలను కలిగినట్టి ఆతని కంఠములో; స్థిత-ఉన్న; గ్రైవం - ముత్యాల హారం; దామోదరం - ఉదరముపై తాడుతో కట్టబడిన వాడు; భక్తిబద్ధమ్ - భక్తి చేత బంధింపబడినది;

అనువాదం

[తల్లి చేతిలో గల బెత్తమును చూసి] అతడు ఏడుస్తూ, రెండు కళ్ళను తన కమల హస్తాలతో పదే పదే నులుముకుంటున్నాడు. అతడి కళ్ళు భయముతో నిండి ఉన్నాయి, మరియు అతడి (శంఖమువలే మూడు రేఖలను కలిగినట్టి ఆతని కంఠములో గల ముత్యాల హారము) అతడు ఏడ్వటం వలన కలిగే దీర్ఘశ్వాస చేత ఊగుతూ ఉన్నది. అతడి ఉదరము తాడు చేత కాక, తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమచేత బంధింపబడినది. అటువంటి దేవాదిదేవుడైన శ్రీ దామోదరునికి నా వినయ పూర్వక ప్రణామములు.


3.

ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే
స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్
తదీయేషితజ్ఞేషు భక్తైర్జితత్వం
పునః ప్రేమతస్తం శతావృత్తి వందే

ప్రతి పదార్థం

ఇతీదృక్ — ఈ విధంగా ప్రదర్శిస్తూ; స్వలీలాభి: - తన స్వంత లీలల ద్వారా; ఆనందకుండే - ఆనంద కుండములో; స్వఘోషం - తన స్వంత కుటుంబ సభ్యులను మరియు ఇతర గోకులవాసులను; నిమజ్జంతం - ముంచెత్తుతున్నాడు; ఆఖ్యాపయంతం - వెల్లడి చేస్తున్నాడు; తదీయేషితజ్ఞేషు - ఐశ్వర్యభావనలో మునిగిన తన భక్తులకు; భక్తైర్జితత్వం - గౌరవ ప్రపత్తులు మిశ్రితము కాని, విశుద్ధ ప్రేమ, ఐశ్వర్యభావ రాహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని; పునః - మరళ; ప్రేమత: ప్రేమతో; తం - ఆ దామోదరునికి; శతావృత్తి - వందల సార్లు; వందే - ప్రణామములను అర్పిస్తున్నాను;

అనువాదం

ఇటువంటి బాల్యలీలలతో అతడు గోకులవాసులను పారవశ్యమనే కుండములలో ముంచెత్తుతున్నాడు. గౌరవ ప్రపత్తులు మిశ్రితము కాని, విశుద్ధ ప్రేమ, ఐశ్వర్యభావ రాహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్యభావనలో మునిగిన తన భక్తులకు వెల్లడి చేస్తున్నాడు. అట్టి దామోదర భగవానునికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామములను అర్పిస్తున్నాను.


4.

వరం దేవ! మోక్షం న మోక్షావధిం వా
న చాన్యం వృణే హం వరేశాదపీహ
ఇదం తే వపుర్ణాథ! గోపాలబాలం
సదా మే మనస్యావిరాస్తాం కిమన్యై :

ప్రతి పదార్థం

వరం - వరములను; దేవ! - ఓ దేవా!; మోక్షం - మోక్షమును; న - లేదు; మోక్షావధిం - (వైకుంఠములో శాశ్వత జీవితము నిచ్చే) సర్వోత్తమ ముక్తిని గాని; వా - లేదా; న - లేదు; చాన్యం - మరెటు వంటి వరమును గాని; వృణే హం - ప్రార్థిస్తున్నాను; వరేశాత్ - అన్నిరకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడవైన; అపి - కూడా; ఇహ - ఇక్కడ; ఇదం - ఈ; వపు: - రూపము; నాథ! - ఓ దేవా; గోపాలబాలం - బాలగోపాలునిగా; సదా - సర్వదా; మే - నా; మనసి - హృదయములో; ఆవిరాస్తాం - ప్రకటితము కావాలని; కిం అన్యై: - ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనమేమిటి?

అనువాదం

ఓ దేవా! నీవు అన్నిరకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడ వైనప్పటికినీ నేను నిరాకార ముక్తిని గాని, వైకుంఠములో శాశ్వత జీవితము నిచ్చే సర్వోత్తమ ముక్తిని గాని, నవ విధ భక్తి ద్వారా పొందదగిన మరెటు వంటి వరమును గాని కోరను. ఓ స్వామీ! నేను కేవలం వృందావనములో బాలగోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయములో ప్రకటితము కావాలనీ కోరుకుంటున్నాను. ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనమేమిటి?


5.

ఇదం తే ముఖాంభోజ మత్యన్తనీలై-
ర్ర్వతం కుంతలైః స్నిగ్ధరక్తైశ్చ గోప్యా
ముహుశ్చుంబితం బింబరక్తాధరం మే
మనస్యావిరాస్తామలం లక్షలాభైః

ప్రతి పదార్థం

ఇదం - ఈ; తే - నీయొక్క; ముఖాంభోజం - ముఖ పద్మం; అత్యన్తనీలై: - అత్యంత నీలి వర్ణములో ఉన్న; వృతం - ఆవరించబడిన; కుంతలైః - ముంగురులు తిరిగిన కురులు; స్నిగ్ధ - మెత్తని మరియు నల్లని; రక్తై: - ఎర్రగా ఉన్నవి; చ - మరియు; గోప్యా - గోపీ (యశోద మాత) ద్వారా; ముహు: - పదే పదే; చుంబితం - ముద్దులాడబడుచున్న; బింబరక్తాధరం - బింబ ఫలముల వలె ఎర్రగా ఉన్న పెదవులు; మే - నా యొక్క; మనసి - హృదయములో; ఆవిరాస్తాం - ప్రకటితమగును గాక; అలం - అనవసరమైన (నాకు అవసరం లేదు); లక్షలాభైః - లక్షల కొలది ఇతర వరములు.

అనువాదం

ఓ స్వామి, నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ ముఖ పద్మమును యశోదామాత పదేపదే ముద్దులాడుతోంది. మరియు నీ పెదవులు బింబాఫలముల వలే ఎర్రగా నున్నవి. నీ ముఖ పద్మము యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయంలో సదా ప్రకటితమగు గాక! వేలకువేల ఇతర వరములతో నాకు అవసరము లేదు.


6.

నమో దేవ దామోదరానంత విష్ణో
ప్రసీద ప్రభో! దుఃఖజాలాబ్దిమగ్నమ్
కృపాదృష్టివృష్ట్యాతి దీనం బతాను-
గృహాణేశ మామజ్ణమేధ్యక్షిదృశ్య :

ప్రతి పదార్థం

నమ: - నా ప్రణామములు; దేవ - ఓ దేవా!; దామోదర - ఉదరముపైన తాడుతో కట్టబదిన ఓ ప్రభూ!; అనంత - ఓ అనంతా!; విష్ణో - ఓ సర్వ వ్యాపక ప్రభూ!; ప్రసీద - కృప చూపించండి; ప్రభో - ఓ ప్రభూ!; దు:ఖజాల - దు:ఖజాలము; అబ్ధిమగ్నం - సముద్రములో మునిగిఉన్న; కృపా దృష్టి వృష్ట్యా - మీ కృపాదృష్టి వర్షింపజేసి; ఆతి దీనం - అత్యంత పతనమైన; బత - అయ్యో!; అనుగృహాణు - దయచేసి స్వీకరించండి; ఈశ - ఓ సర్వ స్వతంత్ర ప్రభూ!; మాం - నన్ను; ఆజ్ఞం - అజ్ఞానుడిని; ఏది - దయచేసి రండి; అక్షి దృశ్య: - నా కళ్ళకు దర్శనమొసగుము.

అనువాదం

ఓ దేవాదిదేవా! నేను నీకు నా ప్రణామము లర్పిస్తున్నాను. ఓ దామోదరా! ఓ అనంతా! ఓ విష్ణో! ఓ ప్రభూ! ఓ నా స్వామీ, నా పై కృప జూపుము. నాపై నీ కృపాదృష్టిని వర్షించి, ప్రాపంచిక దుఃఖసాగరములో మునిగిన ఈ మూర్ఖుని ఉద్ధరింపుము. నా కళ్ళకు దర్శన మొసగుము.


7.

కుబేరాత్మజౌ బద్ధమూర్త్యెవ యద్వత్
త్వయా మోచితౌ భక్తిబాజౌ కృతౌ చ
తతా ప్రేమభక్తిం స్వకాం మే ప్రయచ్ఛ
న మోక్షే గ్రహ మే స్తి దామోదరేహ

ప్రతి పదార్థం

కుబేరాత్మజౌ - కుబేరుని ఇద్దరు పుత్రులైన (నలకూబేర, మణిగ్రీవుల)ను; బద్ధమూర్త్యెవ - చెక్కరోటికి కట్టబడిన దివ్య రూపము ద్వారా; యద్వత్ - ఏవిధముగానైతే ; త్వయా - నీ ద్వారా; మోచితౌ - శాప విమోచన పొందారు; భక్తిబాజౌ - భక్తియుక్త సేవను పొందినవారిగా; కృతౌ - చేసావు; చ - మరియు; తతా - అదే విధముగా; ప్రేమభక్తిం - ప్రేమ భక్తిని; స్వకాం - నీ యొక్క; మే - నాకు; ప్రయచ్ఛ - ప్రసాదించండి;న మోక్షే - మరే ఇతరమైన ముక్తిని; గ్రహ: - ఉత్సాహము; మే - నేను; అస్తి - ఉన్నది; దామోదర - ఓ దామోదరా!; ఇహ - ఈ.

అనువాదం

ఓ దామోదరా! ఏ విధముగానైతే నీవు చెక్కరోటికి కట్టబడిన తరువాత కుబేరుని ఇద్దరు పుత్రులైన నలకూబేర, మణిగ్రీవులను నారదుని శాపము నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మార్చావో, అదే విధముగా నాకు నీ పట్ల ప్రేమభక్తిని ప్రసాదించుము. నేను కేవలం దీనికొరకై పరితపిస్తున్నాను. మరే ఇతరమైన ముక్తిని నేను ఆశించను.


8.

నమస్తే స్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే
త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే
నమో రాధికాయై త్వదీయప్రియాయై
నమో నంతలీలాయ దేవాయ తుభ్యమ్

ప్రతి పదార్థం

నమ: - నా ప్రణామములు; తే - నీకు; అస్తు - ఉండుగాక; ధామ్నే - నీ ఉదరము చుట్టూ కట్టబడిన తాడుకు;స్పురత్ - దేదీప్యమానమైన్; దీప్తి ధామ్నే - ప్రకాశవంతమైన ధామమును; త్వదీయ ఉదరాయ - మీ ఉదరమునకు;అథ - మరియు; విశ్వస్య ధామ్నె - విశ్వమునకు ఆధారమైన వానికు; నమ: - ప్రణామములు; రాధికాయై - రాధారాణికి; త్వదీయ ప్రియాయై - మీకు ప్రియమైన; నమ: - ప్రణామములు; అనంతలీలాయ - అనంతలీలలకు; దేవాయ - నీ దివ్య స్వభావమునకు; తుభ్యం - నీకు.

అనువాదం

ఓ దామోదరా! నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణామములను అర్పిస్తున్నాను. తరువాత విశ్వమంతటికీ నెలవైనట్టి నీ ఉదరమునకు నా ప్రణామములను అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణికి నా వినయ పూర్వక ప్రణామములు మరియు అనంతలీలలను ప్రదర్శించే, దేవాదిదేవుడవైన నీకు నా సమస్త ప్రణామములను అర్పిస్తున్నాను.

teTE